కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తుంది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. ఈసందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణ సీఎంలను అడిగి ఆయా ప్రాంతాల్లో కరోనా ఉద్ధృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, అధికారులు వీడియోలింక్ సమావేశంలో పాల్గొన్నారు.
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మోదీ వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళనిస్వామి, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్, కేరళ సీఎం విజయన్‌తో పాటు కేంద్ర పాలిత ప్రాంత గవర్నర్లు పాల్గొన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.