భద్రాచలం శ్రీరామ దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఏప్రిల్ 11 వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే శ్రీరామ నవమి ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ 5వతేదీన జరిగే శ్రీరామ నవమి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అలాగే రామాలయంలో మంత్రి తుమ్మల ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉగాదిరోజు పంచాంగ శ్రవణం, తిరువీధిసేవ జరుపుతారు. ఏప్రిల్ 1న ఉత్సవాలకు అంకురారోపణ, 2న ధ్వజపట భద్రక మండల లేఖనం, గరుడాదివాసం, తిరువీధిసేవ నిర్వహిస్తారు. 3న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, 4న స్వామివారికి ఎదుర్కోలు ఉత్సవం, 5న మిథిలా ప్రాంగణంలో శ్రీసీతారాముల కల్యాణమహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహిస్తారు. 6న శ్రీరామ పట్టాభిషేకం, 7న సర్వఏకాదశి పూజలు, 8న తెప్పోత్సవం, చోరోత్సవం, 9న ఊంజల్ ఉత్సవం, 10న వసంతోత్సవం, 11న చక్రతీర్థంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భద్రాచలంలోని గోదావరి నదీ తీరంలో నిర్మించిన వరద కర కట్టపై ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాల కాంతులు వెదజల్లనున్నాయి. దీంతో కరకట్ట మరింత శోభను సంతరించుకోనుంది.
శ్రీరామనవవి రోజునే భద్రుని మండపంలో శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభమవుతాయి. సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, శ్రీరామ పట్టాభిషేకానికి గవర్నర్ నర్సింహన్ హాజరుకానున్నారు. మిథిలా స్టేడియంను కలకత్తా పందిళ్లతో అలంకరిస్తున్నారు.
కల్యాణ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుండగా త్వరలోనే నేరుగా విక్రయించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు రెండు లక్షలకు పైగా భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులరాకను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడు లక్షల లడ్డూ ప్రసాదాలను దేవస్థానం తయారుచేయిస్తున్నది. అన్ని ప్రాంతాల్లో కల్యాణ తలంబ్రాల కౌంటర్లను తెరువనున్నారు. భద్రాచలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.