మాఫియా డాన్‌గా శాతకర్ణి..!

121
Balaiah for Mafia Don

పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 16న షూటింగ్ ప్రారంభించిన పూరి. ఆ రోజు బాలకృష్ణ ఎనర్జీ సూపర్బ్ అంటూ తొలి రోజు షూటింగ్ అద్భుతంగా సాగిందని ట్విట్టర్లో వెల్లడించిన పూరి ఆ ట్వీట్ చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో ట్వీట్ తో షాక్ ఇచ్చాడు. బాలకృష్ణ 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

పూరి స్పీడు చూస్తుంటే అనుకున్నట్లే సినిమాను సెప్టెంబరు 29న రిలీజ్ కు రెడీ చేసేలా ఉన్నాడు. భవ్య క్రియేషన్స్ బేనర్ మీద ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘టపోరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి.  ప్రస్తుతం రోగ్‌ ప్రమోషన్స్‌ కోసం కాస్త విరామం తీసుకున్న పూరి మరో వారంలో మళ్లీ ఈ చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతాడు.

ఇక ఈ సినిమాలో అసలు బాలయ్యని పూరి ఎలా చూపించబోతున్నాడనే సందేహం అందరిలో నెలకొంది. అయితే, పూరి నోటి వెంట వచ్చిన ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఇపుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్‌గా కనిపిస్తారు  అంటూ అసలు విషయాన్ని పూరి బయట పెట్టాడు. అయితే మాఫియా డాన్‌ అనగానే ‘కబాలి’లా, ‘బిజినెస్‌మేన్‌’లా వుంటుందని ఊహిస్తారని, గతంలో వచ్చిన మాఫియా డాన్స్‌ క్యారెక్టర్లకి ఇది పూర్తి భిన్నంగా వుంటుందని, ఇందులో కొత్తరకం బాలయ్యని చూస్తారని అతను చెబుతున్నాడు.

ఈ చిత్రంలో పొలిటికల్‌ పంచ్‌లు వుండవని, పూర్తిస్థాయి కమర్షియల్‌ చిత్రమని చెప్పాడు. బాలయ్య సరసన ముగ్గురు హీరోయిన్లు వుంటారని, మెయిన్‌ హీరోయిన్‌ని ఇంకా ఫైనలైజ్‌ చేయలేదని తెలిపాడు. ఓకే అయిన ఇద్దరు హీరోయిన్లు కూడా కొత్తవాళ్లేనట. బాలయ్యతో సినిమా పట్ల పూరి ఎంత ఎక్సయిటెడ్‌గా వున్నాడంటే, ఈ శుక్రవారం విడుదల కాబోతున్న రోగ్‌ గురించి కంటే దీని గురించే అతను ఎక్కువ మాట్లాడుతున్నాడు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పూరికి బాలయ్య సినిమా కలిసివస్తుందో లేదో చూడాలి.