ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్..

96
cm kcr
- Advertisement -

ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు సీఎం కేసీఆర్‌ హాజరైయ్యారు. సీఎంతో పాటు మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్ద‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చిన్నారుల‌కు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తోఫా అందించారు. ఇఫ్తార్ విందు సంద‌ర్బంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

ఈ విందుకు హాజ‌రైన ప్ర‌తినిధులు, ముస్లిం మ‌త పెద్ద‌లంద‌రికీ న‌మ‌స్కారం తెలిపారు. గ‌త కొన్నేళ్ల క్రితం తెలంగాణ వాతావ‌ర‌ణం చాలా ఇబ్బందిగా వుండేది. క‌నీసం తాగ‌డానికి నీళ్లు కూడా లేని ప‌రిస్థితి. వ్య‌వ‌సాయానికి కూడా ఇవ్వ‌డానికి నీళ్లు లేవు. కానీ.. మీ అంద‌రి స‌హ‌కారం వ‌ల్ల ప‌రిస్థితి మారిపోయింది. తెలంగాణ అభివృద్ధి దిశ‌గా అడుగులు వేస్తోంది. భార‌త దేశం మొత్తం నేడు అంధ‌కారంలో వుంది. కానీ తెలంగాణ మాత్రం ధ‌గ‌ద్ధ‌గాయ‌మానంగా, విద్యుత్ కాంతుల‌తో విరాజిల్లుతోంది. తాగేనీరు గానీ, వ్య‌వ‌సాయం గానీ, పండే పంట‌లో కూడా తెలంగాణ మంచి ఫ‌లితాల‌ను సాధించింది అన్నారు.

మైనారిటీ పిల్ల‌ల కోసం అద్భుత‌మైన రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను నిర్మించాం. అన్ని వ‌స‌తులూ క‌ల్పించాం. తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన తీరుగానే.. దేశం మొత్తం కూడా ఇదే విధానాన్ని అవ‌లంబించాల‌ని నేను డిమాండ్ చేస్తున్నాను అన్నారు సీఎం. మీ అంద‌రికీ రంజాన్ పండ‌గ శుభాకాంక్ష‌లు. కేవ‌లం తెలంగాణ ముస్లిం ప్ర‌జ‌ల‌కే కాకుండా దేశంలోని ముస్లింలంద‌రికీ రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. మీ అంద‌రికీ ఒకే విన్న‌పం.. దుష్ట‌శ‌క్తుల ఆట‌లు ఎక్కువ కాలం కొన‌సాగ‌వు. కొన్ని రోజుల పాటు వారిదే పై చేయి అయిన‌ట్లు క‌నిపిస్తుంది. కానీ.. చివ‌రికి మాన‌వ‌త్వ‌మే గెలుస్తుంది. మాన‌వ‌త్వం ఎప్పుడూ న‌శించ‌దు. ఆ మాన‌వ‌త్వం పునాదుల మీద ఒక‌రినొక‌రు స‌హాయం చేసుకుంటూనే వుంటారు. సుహృద్భావ‌, ప్రేమ‌పూర్వ‌క జీవ‌నం అంద‌రికీ ల‌భిస్తుంది అన్నారు సీఎం కేసీఆర్‌.

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలకు సహకారం అందించాలని.. కానీ.. కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందన్నారు. ఆ రోగానికి చికిత్స చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రాజకీయ లబ్దికోసం ప్రస్తుతం దేశంలో మత విద్వేషాలు రగుల్చుతున్నారన్నారు. అయితే అది మాత్రం తెలంగాణలో సాధ్యం కాదని.. అలాంటి మత విద్వేషలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కూల్చివేతలు, పడగొట్టడాలు సులువు దేశాన్ని నిర్మించడం కష్టమన్న సీఎం కేసీఆర్‌.. ఇక్కడ అల్లర్లు చేసే వారి ఆటలు సాగవని హెచ్చరించారు.

- Advertisement -