ఆందోళన అనవసరం, అంతా సిద్ధం: సిఎం కేసీఆర్

247
cm kcr
- Advertisement -

కరోనా వైరస్ విషయంలో ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలే తప్ప, అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకినప్పటికీ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదని, చాలా తక్కువ మంది, అది కూడా ఇతర తీవ్రమైన జబ్బులున్న వారు మాత్రమే తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని చెప్పారు.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, అదే సమయంలో ప్రజలు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకవాలని సూచించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువైనా సరే, తగిన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం సీరియస్ ఉన్న వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేని వారికి హోమ్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సిఎం వెల్లడించారు.

కరోనా విషయంలో తరచూ ఎవరో ఒకరు కోర్టులో పిల్స్ వేస్తున్నారు. దీనివల్ల ప్రతీ రోజు సీనియర్ వైద్యాధికారులు కోర్టుకు వెళ్లాల్సి వస్తున్నది. రోజంతా ఆ పనితోనే సరిపోతున్నది. దీనివల్ల కరోనా కేసులతో పాటు, ఇతర కేసులను పర్యవేక్షించడం కష్టంగా మారుతున్నది. ఈ పిల్స్ లన్నీ నిజానికి ఉద్దేశ్యపూర్వకంగా వేస్తున్నవనే తెలుస్తున్నది. దీనివల్ల వైద్యాధికారుల విలువైన సమయం వృధా అవుతున్నది.ఏ కారణంతో చనిపోయినా సరే, మరణించిన ప్రతీ ఒక్కరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలు అమలుకు సాధ్యం కానివి. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల ప్రతీ రోజు సగటున 900- 1000 మంది వరకు మరణిస్తుంటారు. రాష్ట్రంలో ఏదో మూల ఏదో కారణంతో ఎవరో చనిపోతుంటారు. వారందరికీ పరీక్షలు చేయడం ఎలా సాధ్యమవుతుంది. వైద్య సిబ్బంది వారికి పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆసుపత్రుల్లో ఇతర వైద్య సవేల అందించడం సాధ్యం కాదన్నారు.

రకరకాల జబ్బులతో వచ్చే వారు, డెలివరీల కోసం వచ్చే వారు ఉంటారు. ఇప్పుడు కరోనాతో వస్తున్న వారు ఉంటున్నారు. వారందరినీ వదిలేసి, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. డబ్ల్యు.హెచ్.ఓ. గానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఐసిఎంఆర్ కానీ మృతదేమాలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు. హైకోర్టు ఆదేశాలు ఎట్టి పరిస్థితుల్లో ఆచరణ యోగ్యం కాదు. ఈ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవాలన్నారు.

- Advertisement -