మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. జగన్‌ కొత్త వ్యూహం..!

99
cm jagan
- Advertisement -

ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గరపడింది. ఇందుకోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక కూర్పు, అనుభవం, జిల్లాల అవసరాల ప్రాతిపదికన ప్రస్తుత మంత్రివర్గంలో 7 నుంచి 10 మందిని కొనసాగించే అవకాశముందని తెలిసింది. కొత్తగా 14 నుంచి 17 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయగా.. అసలు జగన్ మంత్రివర్గాన్ని మార్చేస్తుండటానికి కారణం ఏంటి..? ఈ వ్యూహం ఆయనకు ఎలా కలిసి వస్తుందని భావిస్తున్నారు..? సీఎం నిర్ణయంతో వచ్చే లాభమేంటి..? నష్టమేంటో చూద్దాం..!

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేస్తానని అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడున్న మంత్రులు మరో రెండున్నరేళ్లు మాత్రమే పదవుల్లో కొనసాగుతారని.. తర్వాత వారి స్థానాల్లో వేరే వారికి అవకాశం ఇస్తానని చెప్పారు. ఈ మాట చెప్పడం ద్వారా పదవుల నుంచి తప్పుకుంటున్న మంత్రులు అసంతృప్తితో ఉండకుండా ముందుగానే జగన్ జాగ్రత్త పడ్డారు.ప్రస్తుత మంత్రుల్లో కొందరి పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. చేతల కంటే మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం జనాల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారిని మంత్రి వర్గం నుంచి తప్పించడం మినహా మరో మార్గం లేదు. నోటి దురుసు మంత్రులతో ప్రభుత్వానికి జరిగే మేలు కంటే నష్టం వాటిల్లే అవకాశాలే ఎక్కువ. కాగా, ఇంకొందరు మంత్రులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి వారిని కూడా మంత్రి వర్గం నుంచి తొలగించడం వెనుక కారణం లేకపోలేదు. ఇలాంటి వారి సేవలను పార్టీ కోసం వాడుకోవాలనేది జగన్ యోచన.

2024 అసెంబ్లీ ఎన్నికలు జగన్‌కు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలవడం కాదు భారీ మెజార్టీతో గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకూ మంత్రులుగా పని చేసిన వారు ఇక నుంచి పార్టీ కోసం పాటుపడాలనేది సీఎం విధించబోయే టార్గెట్. అందులో విజయం సాధించిన వారికే వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చాక మళ్లీ మంత్రి పదవులు దక్కుతాయి.ఇదే కేబినెట్‌ను ఐదేళ్లపాటు కొనసాగిస్తే.. 150 మంది ఎమ్మెల్యేల్లో కేవలం కొందరికే మంత్రులుగా అవకాశాలు ఇవ్వడం సాధ్యపడుతుంది. కానీ కేబినెట్ పదవి ఆశిస్తోన్న మిగతా సీనియర్ నేతలు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారికి అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ మందికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాదు ఎన్నికలు దగ్గర్లో ఉండటంతో మాటలు, చేతల విషయంలో కొత్త మంత్రులు ఆచితూచి వ్యవహరించే వీలుంది. మొత్తంగా చూస్తే.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం, ఆశావహులు అసంతృప్తి చెందకుండా చూడటం.. ప్రస్తుత సీనియర్ మంత్రుల్లో కొందరికి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతలను అప్పగించడం అనేవి జగన్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. మరి ఈ వ్యూహాలు వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి.

- Advertisement -