పంజాబ్‌లోని ఫాగ్వాడాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఆవరణలో అత్యాచారం జరిగిందన్న ఆరోపణలతో విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టడంతో యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘటనపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందిస్తూ.. డిజిపి గౌరవ్ యాదవ్‌ను సంఘటనా స్థలానికి వెళ్లాలని సూచించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
క్యాంపస్‌లో అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై చెలరేగిన అశాంతి నేపథ్యంలో ఫాగ్వాడాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) పరిసరాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. విశ్వవిద్యాలయం వెలుపల ఉన్న నేషనల్ హైవే-44ను విద్యార్థులు దిగ్బంధించి, హింసాత్మక నిరసనలు మరియు ధ్వంసానికి దిగిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయ ఆవరణలో ఒక విద్యార్థినిపై బయటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగడంతో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.దీనిపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ.. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఘటన స్థలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించాలని సీఎంఓ, డీజీపీ గౌరవ్ యాదవ్‌ను ఆదేశించినట్లు తెలిపింది.
హింసాకాండ దృష్ట్యా యూనివర్సిటీ పరిసరాల్లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎల్‌పీయూ క్యాంపస్ వెలుపల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. క్యాంపస్‌లోనే ఉండే విద్యార్థులు హాస్టళ్లు లేదా వారి నివాస స్థలాలకే పరిమితం కావాలని, అనవసరంగా బయట తిరగవద్దని మరియు ఆందోళనలకు దూరంగా ఉండాలని సూచించారు.
Also Read:బ్యాంకాక్‌ను ముంచెత్తిన వర్షాలు

