మైకుల గోల..పోలీసులకు అల్లు శిరీష్ ఫిర్యాదు!

2
- Advertisement -

గణేష్ నవరాత్రులు, నిమజ్జనం వేడుకల సందర్భంగా విపరీతమైన సౌండ్‌తో డీజేలు, మైక్ సెట్లు పెట్టడంపై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా హద్దుల్లేకుండా డీజే బాక్సులు మోగించడంపై ఆయన సామాజిక మాధ్యమం ‘X’ (ట్విట్టర్) వేదికగా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ షేక్‌పేట్‌లోని ‘అపర్ణ వన్’ అపార్ట్‌మెంట్‌లో అల్లు శిరీష్ నివాసముంటున్నారు. తమ నివాసం సమీపంలోని వినోభా నగర్‌లోని హనుమాన్ టెంపుల్ వద్ద గత కొద్ది రోజులుగా పరిమితికి మించి (నాయిస్ పొల్యూషన్ నిబంధనలు ఉల్లంఘించి) మైకులు, డిజె సౌండ్స్ పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

“గౌరవనీయులైన హైదరాబాద్ పోలీసులకు.. నేను షేక్‌పేట్ అపర్ణ వన్ లో ఉంటున్నాను. గత కొన్ని రోజులుగా వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద అనుమతించిన పరిమితికి మించి, రాత్రి 2 నుండి 3 గంటల వరకు విపరీతమైన సౌండ్‌తో పాటలు పెడుతున్నారు. దీనివల్ల మా సొసైటీలోని చిన్న పిల్లలు, వయోవృద్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిమజ్జనం వరకు భరించాలని చెప్పారు. కానీ పండుగ అయిపోయినా ఈ మైకుల మోత మాత్రం ఆగడం లేదు. దయచేసి ఈ విషయంపై వెంటనే తగిన చర్యలు తీసుకోండి అని కోరారు.

Also Read:పొంగులేటిపై ఈడీకి బీఆర్ఎస్ ఫిర్యాదు

అల్లు శిరీష్ చేసిన పోస్ట్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ అధికారిక ఎక్స్ ఖాతా వెంటనే స్పందించింది. ఈ అంశాన్ని సంబంధిత ఫిల్మ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) దృష్టికి తీసుకెళ్లామని, తక్షణమే అవసరమైన చర్యలు తీసుకుంటామని రీ-ట్వీట్ చేశారు.

- Advertisement -