థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న రికార్డు స్థాయి వర్షాలకు నగర వ్యాప్తంగా జలమయమైంది. ప్రధాన రహదారులు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలు వరద నీటిలో చిక్కుకోవడంతో ప్రజల సాధారణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
పరిస్థితి తీవ్రతను గమనించిన స్థానిక అధికారులు బ్యాంకాక్‌లోని 50 జిల్లాలను డిజాస్టర్ జోన్ (విపత్తు ప్రభావిత ప్రాంతాలు) గా ప్రకటించారు. నగరంలోని ప్రధాన కాలువలు, మురుగునీటి కాల్వలు పొంగిపొర్లడంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను, సరస్సులను తలపిస్తున్నాయి. వేలాది వాహనాలు వరద నీటిలో నిలిచిపోవడంతో నగరవ్యాప్తంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
3 రోజులుగా ఎడతెరిపి లేకుండా రికార్డు వర్షపాతం నమోదుకాగా 50 జిల్లాలు డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు. రవాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. భారీ వరద నీటిని బయటకు పంపేందుకు పంపింగ్ స్టేషన్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ALso Read:పాక్‌కు ఉగ్రవాదం అలవాటే!

