పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) పిలుపునిచ్చిన నిరసనల్లో యువత, విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించేందుకు ముంబై పోలీసులు వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పటికే నమోదైన కేసులను (FIRs) ఆధారంగా చేసుకుని ఆందోళనకారులను రోడ్డెక్కకుండా కట్టడి చేశారు.
వర్సోవా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ సీనియర్ ఇన్స్‌పెక్టర్ ఓ నిరసనకారురాలికి వాట్సాప్ ద్వారా సందేశం పంపిస్తూ.. ఆమె నిరసన స్థలానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నట్లు నిరూపించడానికి లైవ్ లొకేషన్ షేర్ చేసి ఆన్‌లో ఉంచాలి అని కోరినట్లు వెలుగులోకి వచ్చింది.
నిరసనల్లో పాల్గొన్న చాలామంది యువకులు తమ ఇళ్లలో ఈ విషయం చెప్పలేదు. అయితే పోలీసులు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి హెచ్చరికలు జారీ చేయడంతో వారి కుటుంబ సభ్యులకు విషయం తెలిసి, పిల్లలను నిరసనలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ నుంచి పలువురికి కాల్స్ వచ్చాయి. దర్యాప్తులో భాగంగా అధికారులు ఇంటికి వస్తున్నారని, బయటకు రావద్దని ఆదేశించారు. మరోసారి నిరసనల్లో కనిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.
Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం
విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమాచారం ప్రకారం.. చాలామందికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయని, మళ్లీ ఆందోళనల్లో పాల్గొంటే మరిన్ని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారని తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. తమ ఉద్దేశం యువత భవిష్యత్తును కాపాడటమేనని తెలిపారు. చిన్న వయసులోనే ఎఫ్‌ఐఆర్‌లలో పేర్లు నమోదు కావడం వల్ల వారి భవిష్యత్తు, విదేశీ విద్య, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ దెబ్బతింటాయని, అందుకే వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశామని చెప్పారు. అలాగే ఈ నిరసనలను సమన్వయం చేస్తున్న కొన్ని విదేశీ వాట్సాప్ గ్రూపులపై కూడా నిఘా ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు.

