తెలంగాణలో గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, గ్లోబరీనా (Globarena) వ్యవహారానికి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యులంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం నీ పదవికే అవమానకరం. కనీసం ఒక్కసారైనా ఒక చీఫ్ మినిస్టర్‌లా ప్రవర్తించడం నేర్చుకో. పేపర్ లీక్ వంటి దురదృష్టకర అంశాలపై ఫేక్ న్యూస్, అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.గ్లోబరీనా సంస్థతో బీఆర్‌ఎస్ పార్టీకి గానీ, తన కుటుంబానికి గానీ లేదా తనకు గానీ ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
త్వరలోనే రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. చేసిన అబద్ధపు ఆరోపణలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నువ్వు చేసే అసభ్యకరమైన, అర్థంలేని ఆరోపణలకు నేను చాలాసార్లు స్పందించను. దానర్థం నీ మాటలతో నేను ఏకీభవిస్తున్నానని కాదు. బురదలో దిగి కుస్తీ పట్టడం నాకు ఇష్టం ఉండదు.. అందుకే ఎక్కువ సార్లు మౌనంగా ఉంటాను అని కేటీఆర్ తన వైఖరిని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి నిరంతరం రాజకీయ కక్ష సాధింపు చర్యలు, దుష్ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పాలనను గాలికొదిలేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు.


