లీక్ అయ్యాక శిక్షలు కాదు..లీక్ కాకుండా చూడండి!

2
- Advertisement -

పేపర్ లీక్ కేసులలో వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. విద్యార్థులు గత నెలన్నర రోజులుగా సుదీర్ఘ నిరసనలు తెలియజేస్తున్న తర్వాత ప్రధాని తీరిగ్గా స్పందించారని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మండిపడ్డారు.

పేపర్ లీక్ అయిన తర్వాత విచారణలు జరిపి శిక్షలు విధించడం వల్ల విద్యార్థులకు జరిగిన అన్యాయం లేదా నష్టం తిరిగి రాదు. పేపర్ లీక్ అయ్యాక చర్యలు తీసుకోవడం కంటే, అసలు లీక్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడమే ముఖ్యం. గాయం అయిన తర్వాత మందు రాయడం కాదు, అసలు గాయం కాకుండా చూడటమే అసలైన పరిష్కారం అని ఆయన స్పష్టం చేశారు.

అసలు దేశంలో పదేపదే పేపర్ లీక్‌లు ఎందుకు జరుగుతున్నాయో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని అశుతోష్ రాంకా డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను నడిపిస్తున్న అధికారులకు, ప్రభుత్వానికి జవాబుదారీతనం, సమర్థత లేకపోవడం వల్లే ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు.

Also Read;పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ పదవికి రాజీనామా చేసే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తాము ఈ నిరసన స్థలిని (జంతర్ మంతర్) వదిలి వెళ్లేది లేదని, తమ ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న పరీక్షా విధానాల్లో సమూల మార్పులు తెచ్చే వరకు తమ సమర శంఖం కొనసాగుతుందని సీజేపీ నేతలు హెచ్చరించారు.

- Advertisement -