నీట్ (NEET-UG) పరీక్షల అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శన శుక్రవారానికి ఏడో రోజుకు చేరుకుంది. సరిగ్గా ఇదే రోజున కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజు కావడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆయనకు ఒక వినూత్నమైన బహుమతి ఇస్తానని ప్రకటిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తామే స్వయంగా ఆయనకు రాజీనామా లేఖను సిద్ధం చేసి పంపిస్తామని, మంత్రి కేవలం దానిపై తన బొటనవేలు ముద్ర వేస్తే సరిపోతుందని దిప్కే వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో…అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ వద్ద ఒక వైట్‌బోర్డ్‌పై హ్యాపీ బర్త్‌డే ప్రధాన్, ప్లీజ్ రిజైన్ అని రాస్తుండగా వెనుక ఉన్న నిరసనకారులు పుట్టినరోజు పాట పాడుతూ కనిపించారు.
ఈ నిరసనలకు ప్రముఖ పర్యావరణ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా తన పూర్తి మద్దతును ప్రకటించారు. జూన్ 27 లోగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలపై స్పందించకపోతే, జూన్ 28 నుండి తాను కూడా జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జెనీవాలో ఉన్న వాంగ్‌చుక్, అక్కడి ఐక్యరాజ్యసమితి (UN) కార్యాలయం వెలుపల ఉన్న నిరసన ప్రాంతం నుండి ఎక్స్ (X) లో ఒక వీడియో సందేశాన్ని పంచుకుంటూ.. దేశ విద్యావ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు లడఖ్ పర్యావరణం, సంస్కృతి పరిరక్షణే తన ప్రధాన డిమాండ్లని స్పష్టం చేశారు. ఒకవేళ శనివారంలోగా ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే, తాను విద్యార్థులతో కలిసి నిరాహార దీక్షలో కూర్చుంటానని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, సీజేపీకి చెందిన సోషల్ మీడియా ‘ఎక్స్’ (X) ఖాతాను ప్రభుత్వం నిలిపివేయడంపై అభిజీత్ దిప్కే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ministry (MeitY) కమిటీ ముందు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ తమ ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారనే దానికి అధికారులు ఎలాంటి సరైన కారణాలు చెప్పలేదని ఆ ఉత్తర్వులను అడగగా అవి ‘రహస్యం’ అని దాటవేశారని ఆరోపించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ ఇక్కడ ప్రతిదీ రహస్యమే అయితే నీట్ ప్రశ్నపత్రాన్ని కూడా రహస్యంగా ఉంచాల్సింది కదా అని అది లీక్ కావడం వల్లే ఇంతమంది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అకౌంట్లను పాకిస్తాన్‌కు చెందిన నెటిజన్లు ఫాలో అవుతున్నారనే నెపంతో బ్లాక్ చేశారని అధికారులు చెప్పినట్లు దిప్కే పేర్కొన్నారు.
Also Read:సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటన

