రామాలయ అక్రమాలు..SITపై ఆప్‌

1
- Advertisement -

అయోధ్య రామాలయ భూముల కొనుగోలులో జరిగాయని చెప్తున్న అక్రమాలకు సంబంధించిన కీలక పత్రాలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రత్యేక విచారణ బృందానికి (SIT) సమర్పించారు. అయితే, ఈ వ్యవహారంలో సాగుతున్న దర్యాప్తు ప్రక్రియ తీరుపై, విచారణ ఎదుర్కొంటున్న నిందితుల పట్ల అధికారులు వ్యవహరిస్తున్న విధానంపై ఆయన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆప్ తరఫున పలు ప్రశ్నలను లేవనెత్తారు.

సంజయ్ సింగ్ లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రామాలయ ట్రస్ట్ భూముల కొనుగోలు వ్యవహారంలో కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని ఆరోపించారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తక్కువ ధరకు ఉన్న భూమిని…ట్రస్ట్‌కు భారీ ధరలకు విక్రయించారనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీలు, సేల్ డీడ్స్ మరియు మనీ ట్రాన్సాక్షన్ల వివరాలను తాము సిట్ అధికారులకు అందజేసినట్లు వెల్లడించారు.

పత్రాలను సమర్పించిన అనంతరం ఈ కేసులో దర్యాప్తు సాగుతున్న తీరును సంజయ్ సింగ్ తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులను మరియు ఈ డీల్స్‌లో భాగస్వాములైన నిందితులను అధికారులు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని కస్టడీలోకి తీసుకుని విచారించకుండా కేవలం కాగితాల పరిశీలనతోనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

సాధారణంగా ఏదైనా అవినీతి కేసులో ఆధారాలు లభిస్తే తక్షణమే నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తారు. కానీ రాముడి పేరుతో భక్తులు ఇచ్చిన విరాళాలను దోచుకున్న ఈ కేసులో మాత్రం నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియ చూస్తుంటే నిజాలు బయటకు వస్తాయనే నమ్మకం కలగడం లేదు అని సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Also Read:సీషెల్స్‌లో ప్రధాని మోదీ పర్యటన

కోట్లాది మంది హిందువుల నమ్మకానికి, సెంటిమెంట్‌కు సంబంధించిన ఈ అంశంలో పారదర్శకత చాలా అవసరమని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. ఈ భూ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందుకు తీసుకురావాలని….కోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థ ద్వారా నిష్పక్షపాతమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

- Advertisement -