సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… జూన్ 27 నుండి 29 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ (గోల్డెన్ జూబ్లీ) వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొంటారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రాత్మక వేడుకల్లో భాగంగా భారత రక్షణ దళాల విభాగంతో పాటు, భారత నౌకాదళానికి చెందిన రెండు యుద్ధ నౌకలు కూడా ఈ ఉత్సవాల్లో భాగం కానున్నాయి. అంతకుముందు ప్రధాని మోదీ 2015లో సీషెల్స్‌ను సందర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు హెర్మినీతో ద్వైపాక్షిక సహకారంపై ఉన్నత స్థాయి చర్చలు జరపడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై వ్యూహాత్మక ఆలోచనలను పంచుకోనున్నారు. అలాగే సీషెల్స్ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు మరియు అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజంతో (డయాస్పోరా) సమావేశం కానున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కీలకమైన సముద్ర తీర పొరుగుదేశంగా ఉన్న సీషెల్స్, భారతదేశ ‘మహాసాగర్’ విజన్‌లో మరియు గ్లోబల్ సౌత్ పట్ల ఉన్న నిబద్ధతలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇటీవలే ఫిబ్రవరిలో సీషెల్స్ అధ్యక్షుడు హెర్మినీ ఆరు రోజుల పాటు భారతదేశంలో పర్యటించారు. ఆ సమయంలో డిజిటల్ గవర్నెన్స్ కోసం సీషెల్స్‌లో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్ మద్దతు ప్రకటించింది. దీనితో పాటు, ఇరు దేశాల ఆర్థిక వృద్ధి, భద్రత లక్ష్యంగా చేసుకున్న ‘సౌత్-ఈస్ట్-ఈస్ట్-లింకేజెస్’ (SESEL) విజన్ కింద సీషెల్స్ అభివృద్ధి కోసం భారతదేశం 175 మిలియన్ డాలర్ల (USD) ‘ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ’ని ప్రకటించింది. ఇందులో 125 మిలియన్ డాలర్ల రుణం (లైన్ ఆఫ్ క్రెడిట్) మరియు ప్రాజెక్టుల అభివృద్ధి, రక్షణ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కోసం 50 మిలియన్ డాలర్ల గ్రాంట్ సాయం ఉన్నాయి. ప్రధాని మోదీ ప్రస్తుత పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న పటిష్టమైన బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని భావిస్తున్నారు.
Also Read:సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

