నిందితుడు రాజు మృతిపై చిరు ట్వీట్‌..

43

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సింగరేణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ళ చిన్నారి హత్యాచార కేసు ఎంత క‌ల‌కలం రేపిందో అందరికీ తెలిసిందే. అభం శుభం తెలియ‌ని చిన్నారికి మాయ‌మాట‌లు చెప్పి రాజు అనే కీచ‌కుడు హ‌త్యాచారం చేసిన సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని నివ్వెర‌ప‌ర‌చింది. నిందితుడికి త‌గిన శిక్ష వేయాల‌ని సామాన్యులు, సెల‌బ్రిటీలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.

అయితే నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ఈరోజు నిర్దారించారు. ఘన్‌పూర్‌ నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై అతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలో రాజు మృతిపై హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. పాపకు న్యాయం జరిగిందంటూ సెలబ్రిటీలు ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్టర్‌ వేదికగా స్పందించారు.

‘‘అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతోపాటు పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.