ఉత్తేజ్‌ను ఓదార్చిన మెగాస్టార్‌ చిరంజీవి..

44

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్‌ను మెగాస్టార్‌ చిరంజీవి ఓదార్చారు. ఇటీవల ఉత్తేజ్ సతీమణి పద్మ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సంస్మరణ కార్యక్రమాన్ని గురువారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఉత్తేజ్ కుటుంబ సభ్యులతో పాటు చిరంజీవి, శ్రీకాంత్, రాజశేఖర్, సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్తేజ్ భార్య పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు చిరు. కాగా చిరంజీవిని చూసి ఉత్తేజ్ మరోసారి తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. చిరంజీవిని హత్తుకుని భోరున విలపించారు. దాంతో చిరంజీవి.. ఉత్తేజ్‌ను ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు.

ఈ సంతాప సభలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ” భార్యా వియోగం అన్నది చాలా దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను. హిట్లర్ సినిమా నుండి ఉత్తేజ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ ఆపద సమయంలో ఉత్తేజ్‌కు మేము అందరం అండదండగా ఉంటాం. ఈ విషాదం నుండి ఉత్తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ” అన్నారు.