మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఖైదీతో వందకోట్లు వసూల్ చేసిన చిరు తన 151వ సినిమాతో కూడా తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గతంలోనే ఖరారైన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లలేదు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంటుందని అందరూ అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ లేదని తేలింది. ఈ రోజు టైటిల్ లోగో లాంచ్ చేసి.. కొంతవరకు అభిమానుల్ని సంతోషపెట్టాలని.. ప్రారంభోత్సవం ఆ తర్వాత అన్నీ సెట్ అయ్యాక మొదలుపెట్టాలని అనుకున్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ దిశగా ఫ్యాన్స్ ప్రిపేరవుతుండగా.. ఈ రోజు ఉదయం చడీచప్పుడు లేకుండా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ముహూర్త కార్యక్రమం పూర్తి చేసేసింది చిత్ర బృందం.
కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో బుధవారం ఉదయం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ప్రారంభోత్సవం చడీచప్పుడు లేకుండా చాలా సింపుల్ గా పూర్తి చేశాడట రామ్ చరణ్. చిరంజీవి.. చరణ్.. సురేందర్ రెడ్డిలతో పాటు అ్లలు అరవింద్.. సురేఖ. పరుచూరి సోదరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. మామూలుగా ముహూర్త కార్యక్రమంలో స్క్రిప్టు చేతికిచ్చేటపుడు ఒక ఫైల్ కనిపిస్తుంది. కానీ ‘ఉయ్యాలవాడ..’ ప్రారంభోత్సవం సందర్భంగా మూడు పెద్ద ఫైల్స్ కనిపించడం విశేషం. దీన్ని బట్టి ఇది పెద్ద సినిమా కావచ్చని.. డైలాగులు భారీ స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు. పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి.. ఇంకో ఇద్దరు రచయితలు కలిపి ఈ కథ తయారుచేశారు.