సీఎం కేసీఆర్‌పై త్రిదండి చినజీయర్ స్వామి ప్రశంసల వర్షం కురిపించారు. భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన సంధ్యాహారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చినజీయర్ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దేవుడి సేవ చూస్తూ కేసీఆర్ ముందున్నారని తెలిపారు.
దేవుళ్ల సొత్తు తినే ట్రెండ్‌కు కేసీఆర్ చరమగీతం పాడారని కొనియాడారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి అభివృద్ధికి పాటుపడుతున్న కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. వానలు కురిసి పంటలు పండి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే దేవుడి సేవ చేయాలని చినజీయర్ సూచించారు.
దైవక్షేత్రాల్లో సేవను విస్తృతపరిచేలా ముఖ్యమంత్రి లోకహితం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైదిక వర్గానికి వసతులు కల్పించేందుకు, అర్చకులకు సముచిత గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయమన్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకున్నారని, ఆయనకు రాముడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ప్రార్థనలు వినే కోదండ రాముడిని ఆరాదించుకోవడం ఎన్నో జన్మల సుకృత విశేషమని, భద్రాద్రిలో సంధ్యాహారతి ప్రారంభించుకోవడం ఈ ప్రాంతవాసుల అదృష్టమని అన్నారు.
భక్తులు నేరుగా సేవలో పాల్గొనేలా సేవా నిరతిని అందంగా తీర్చిదిద్దే కార్యక్రమమే సంధ్యాహారతి అని వివరించారు. సేవ విస్తృతి సంధ్యాహారతితో ఉంటుందని, రెండు కాలాలకు మధ్యగా ఉండే కాలమే సంధ్యాకాలమని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావు తదితరులు హాజరయ్యారు.