ఐపీఎల్ 12 తుది అంకానికి చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయిర్ 2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది చెన్నై. తొలిసారి ఫైనల్ చేరాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ కల నెరవేరలేదు. ఐపీఎల్‌లో చెన్నై ఫైనల్ చేరడం ఇది ఎనిమిదో సారి కావడం విశేషం.ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబైతో తలపడనుంది చెన్నై. మూడు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, చెన్నై టైటిల్ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి విజయం సాధించింది.ఓపెనర్లు వాట్సన్ (50; 32 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్ (50; 39 బంతుల్లో 7×4, 1×6) రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని చెన్నై మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 147 పరుగులు చేసింది. పృథ్వీ షా (5),ధావన్ (18),మన్రో (27),శ్రేయస్ అయ్యర్ (13), రూథర్డ్‌ఫర్డ్ (10), కీమో పాల్ (3) పరుగులు చేశారు.
చెన్నై, ముంబయి ఫైనల్లో తలపడనుండటం ఇది నాలుగోసారి. తొలిసారి 2010లో చెన్నై, ముంబయి తలపడ్డాయి. అప్పుడు ధోనిదే పైచేయి అయింది. ఆ తర్వాత 2013, 2015లో చెన్నైని ఓడించి ముంబయి విజేతగా నిలిచింది.