టీఆర్ఎస్ అభ్యర్థులు రెడీ..ఎటు తేల్చుకోలేని కాంగ్రెస్‌..!

278
kcr uttam

రంగారెడ్డి,వరంగల్,నల్గొండ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14 నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు ఫైనలైజ్ అయినట్లు తెలుస్తోంది. ఫెడరల్ టూర్ ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్ ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

ఇవాళ ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో జరిగే సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా స్థానిక కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు కె.శశిధర్ రెడ్డి, వేనపల్లి చందర్ రావు, తేర చిన్నపురెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే గుత్తా పేరు దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఇక వరంగల్ జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

ఇక మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఎన్నికల బరిలో ఉండాలా లేదా అన్న అంశాన్ని ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇవాళ జరిగే ముఖ్యనేతల సమావేశంలో పోటీలో ఉండే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌. పాత ఎంపీటీసీ,జడ్పీటీసీలకే ఓటు వేసే అవకాశం కల్పించడంతో భేటీకి దూరంగా ఉండటమే మేలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌,రంగారెడ్డిలో టీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉండటం గతంలో ఏకగ్రీవంగా ఇక్కడ విజయం సాధించడంతో ఈ రెండు స్ధానాలను పక్కన పెట్టి నల్గొండ నుండి అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలను పరిశీలించనున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్‌ మాత్రం గెలుపు సంగతి పక్కనపెడితే కనీసం పోటీలో ఉంటే ఎలా ఉంటుందనే అంశంపై తలమునకలైనట్లు తెలుస్తోంది.