నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు అపరెల్ పార్కులో ఇమెజేస్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చేనేత బీమా పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్లకు మంచి రోజులు వచ్చాయి… పెద్దూర్ అపరెల్ పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. 80 శాతానికి పైగా మహిళలకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బతుకమ్మ చీరలు, గవర్నమెంట్ స్కూల్స్ యూనిఫాం ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో నేతన్నల ఆదాయం పెరిగింది అని కేటీఆర్ తెలిపారు.
ఈ 60 ఎకరాల్లో రాబోయే రోజుల్లో రెండు, మూడు ఫ్యాక్టరీలు వరుసగా రాబోతున్నాయి. రాబోయే 6 నెలల్లో గోకల్‌దాస్ కంపెనీ ప్రారంభం కాబోతుంది అని కేటీఆర్ తెలిపారు. భారతదేశంలోనే అత్యధికంగా పత్తి పండిస్తున్న రాష్ర్టంగా తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది అని కేటీఆర్ చెప్పారు. వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్ వన్ అనే సంస్థ 300 ఎకరాల్లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దీంతో 12 వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని వెల్లడించారు. కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వరంగల్‌కు తరలివచ్చింది అని కేటీఆర్ గుర్తు చేశారు.