లంకను తిప్పేసిన చాహల్…

207
Chahal Becomes Highest T20I Wicket-taker in 2017
- Advertisement -

ఫార్మాట్‌ ఏదైనా టీమిండియా జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే వరుసగా 8 వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత్‌…పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేస్తోంది. కటక్ టీ20లో అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని  ప్రదర్శించిన భారత్‌.. లంకను చిత్తు చేసింది.  భారత స్పిన్నర్  చాహల్‌ తన మాయాజాలంతో లంక పతనాన్ని శాసించాడు.

భారత్  విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో లంక బ్యాట్స్‌ మెన్ పూర్తిగా విఫలమయ్యారు. ఏ దశలోనూ స్కోరును చేధించే ప్రయత్నం చేయలేకపోయారు. భారత స్పిన్నర్లు చాహల్‌ (4/23), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/18) ధాటికి విలవిలలాడిన శ్రీలంక.. 16 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. తరంగ (23) ఆ జట్టు టాప్‌ స్కోరర్‌. టీ20ల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

Chahal Becomes Highest T20I Wicket-taker in 2017
అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్,లోకేష్ రాహుల్‌ మంచి శుభారంభాన్నిచ్చింది. కేఎల్‌ రాహుల్‌ (61; 48 బంతుల్లో 7×4, 1×6), ధోని (39 నాటౌట్‌; 22 బంతుల్లో 4×4, 1×6), మనీష్‌ పాండే (32 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు మెరిపించారు. భారత్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి నాలుగు ఓవర్లే హైలైట్‌. చివరి  నాలుగు ఓవర్లలో 61 పరుగులు రాబట్టి భారత్‌కు మంచి స్కోరును అందించింది. ముఖ్యంగా మనీష్‌ పాండే చక్కని షాట్లతో అలరించాడు.  తొలి 10 బంతుల్లో 11 పరుగులే చేసిన ధోని కూడా చివర్లో ధాటిగా ఆడి జట్టు మెరుగైన స్కోరు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. పెరీరా బౌలింగ్‌లో డీప్‌ స్కేర్‌ లెగ్‌లో సిక్స్‌తో ధోని..భారత్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు.మెరవడంతో మొదట భారత్‌ 3 వికెట్లకు 180 పరుగులు సాధించింది. చాహల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. రెండో టీ20 శుక్రవారం ఇండోర్‌లో జరుగుతుంది.

చాహల్ టీ20లలో అద్భుత ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది అత్యధిక వికెట్లు పడగొట్టిన వాడిగా రికార్డులకెక్కాడు. బుధవారం కటక్‌లో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో చాహల్ నాలుగు  వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ ఏడాది మొత్తం 10 మ్యాచులు ఆడిన చాహల్ మొత్తం 19 వికెట్లు నేలకూల్చాడు. చాహల్ తర్వాతి స్ధానంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, విండీస్ పేసర్ క్రెసిక్ విలియమ్స్‌లు 17 వికెట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

- Advertisement -