దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున‌్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నియంత్రణకు సంబంధించిన నియమావళిని పాటించాలని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31 వరకు ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించి, మహమ్మారి కట్టడికి కృషి చేయాలని తెలిపింది. గుంపులుగా గుమికూడే జనాలపై అదనపు జరిమానాలు విధించుకోవచ్చని… అయితే, కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మాత్రం లాక్ డౌన్ విధించాలంటే అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని… ఈ బాధ్యత జిల్లా యంత్రాంగం, పోలీసులదేనని చెప్పింది.
ఆరోగ్యసేతు యాప్ ను అందరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రోత్సహించాలని కేంద్రం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయాలని.. మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధించాలని చెప్పింది. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కేంద్రం తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చుకోవచ్చని కేంద్రం తెలిపింది.
50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లను తెరుచుకోవచ్చని చెప్పింది. అంతర్జాతీయ ప్రయాణికులను అనుమతించాలని తెలిపింది. స్విమ్మింగ్ పూల్స్ ను కేవలం క్రీడాకారుల శిక్షణ నిమిత్తమే అనుమతించాలని చెప్పింది. విద్య, వినోదం, క్రీడలు, ఆధ్యాత్మిక, సామాజిక, మతపరమైన కార్యక్రమాలకు 50 శాతం సామర్థ్యంతో హాల్లోకి అనుమతించవచ్చని తెలిపింది. ఇతర సామూహిక కార్యక్రమాలకు 200కు మించి అనుమతి లేదని చెప్పింది.