హైద‌రాబాద్‌లో బీజేపీ చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తుంది..

42
indrakaran reddy

ప్ర‌జ‌ల‌కు ఏం చేశారు ? ఏం చేస్తారో ? చెప్ప‌కుండా మ‌తం పేరుతో ప్ర‌జ‌లను విడ‌గొట్టే ప్ర‌య‌త్నాల‌ను బీజేపీ చేస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌కర‌ణ్ రెడ్డి ఆగ్రహాం వ్య‌క్తం చేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న నగర ప్రజలను చిందరవందరచేసే కుట్రకు పాల్పడటం బీజేపీకి తగదని హితవు ప‌లికారు. బంజారాహిల్స్ లోని రాజ్య‌స‌భ స‌భ్యులు కే. కేశ‌వ‌రావు నివాసంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.

హైద‌రాబాద్ పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. హైద‌రాబాద్ ఏమైనా పాకిస్తాన్ లేక‌ అఫ్ఘ‌నిస్తాన్ లో ఉందా అని ప్ర‌శ్నించారు. దేశ అంత‌ర్భాగంపైనే దాడులు చేస్తారా అని నిల‌దీశారు. ప్రజలను రెచ్చగొట్టి, భయభ్రాంతులకు గురిచేసి ఓట్లు పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నార‌న్నారు. అభివృద్దిపై మాట్లాడి ఓట్లు అడ‌గాల‌ని హిత‌వు ప‌లికారు.

డిసెంబ‌ర్ 5 త‌ర్వాత వ‌ర‌ద బాధితులంద‌రికీ సహాయం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి నేరుగా నిధులు ఇవ్వ‌డానికి లేద‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వమే నిధులు ఇవ్వాల‌ని వ‌ర‌ద స‌హాయంపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి చెప్పుతున్నార‌ని మ‌రి రూ. 25 వేల వ‌ర‌ద స‌హాయం ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ నాయకుల మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా న‌మ్మ‌డం లేద‌ని గ్రేటర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 100 సీట్లు సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లో గ‌తంలో పోలింగ్ శాతం త‌క్కువ‌గా నమోదు అయింద‌ని, ప‌ట్ట‌ణ, గ్రామీణ ప్రాంత ప్ర‌జ‌ల మాదిరిగానే న‌గ‌ర ఓట‌ర్లు పెద్ద ఎత్తున ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి కోరారు.