టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, పలువురు ఎంపీలు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ మౌళిక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదించిన సంగతిని నితిన్ గడ్కరీ తెలిపారని ఈ సందర్భంగా నామ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు , రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచన మేరకు హైదరాబాద్ చుట్టూ 334 కిలో మీటర్ల పొడవు మేర రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందేనని నామ చెప్పారు .
ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విడతలుగా కేంద్రానికి లేఖలు రాయడం జరిగిందని అన్నారు . దీని నిర్మాణం పూర్తతే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని నామ అన్నారు . ముఖ్యంగా పారిశ్రామికంగా మరింత పురోగమిస్తుందని అన్నారు . సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి , రీజినల్ రింగ్ రోడ్డుకు రూపకల్పన చేశారని నామ పేర్కొన్నారు . 2017 లో సంగారెడ్డి , తుఫ్రాస్ , చౌటుప్పల్ వరకు ఫస్ట్ ఫేజ్ లో నిర్మించే జాతీయ రహదారికి ఎన్ . హెచ్ . 161 ఎఎ గా నెంబర్ కేటాయించారని , దీనిని 166 కిలో మీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి విధితమేనని నామ తెలిపారు . ఈ మేరకు డీపీఆర్ ను ఎన్.హెచ్.ఎ.ఐ. కి , నిర్మాణానికి ఒప్పందం చేసుకున్న కన్సల్టెంట్ కు అప్పగించడం కూడా జరిగిందన్నారు .
ఇక సెకండ్ ఫేజ్ లో చౌటుప్పల్ – షాద్ నగర్ మీదుగా కంది వరకు నిర్మించే 182 కిలో మీటర్ల రహదారి ప్రాజెక్టును కూడా జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్ ఇవ్వాలని కేంద్ర రోడ్లు , రవాణా మంత్రిత్వ శాఖకు నివేదికలు సమర్పించడం జరిగిందన్నారు . 2018 జనవరి 27 న , 2018 ఆగస్టు 27 న ఇచ్చిన లేఖలకు సంబంధించిన అలైన్మెంట్లను ఆమోదించాలని కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు . అయితే 2018 , ఆగస్టు 27 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన భేటీలో ఇందుకయ్యే వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వడం జరిగిందని నామ తెలిపారు . నాగపూర్ – హైదరాబాద్ – బెంగుళూరు కారిడార్ , పూణే – హైదరాబాద్ – విజయవాడ కారిడార్ లో జాతీయ రహదారి కనెక్టివిటీ ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు . అంతేకాకుండా హైదరాబాద్ నగరంతో పాటు నగరం చుట్టు పక్కల వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు రీజినల్ రింగ్ రోడ్డు ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ నామ పేర్కొన్నారు .
తద్వారా హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోదాడ – ఖమ్మం నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. భారత్ మాల పరియోజన పథకం కింద 31.80 కిలో మీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారని చెప్పారు . ఈ రహదారిని త్వరిత గతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని నితిన్ గడ్కరీ తెలిపారని చెప్పారు . ఇందుకు అవసరమైన భూసేకరణ చేశారని , త్వరలో టెండర్లు కూడా పిలుస్తారని చెప్పారు . అటవీ శాఖ క్లియరెన్స్ కూడా లభిస్తుందన్నారు . విభజన చట్టం హామిలలో భాగంగా రాష్ట్రంలోని ప్రతిపాదిత జాతీయ రహదారులను , ఇతర పెండింగ్ రహదారులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారని నామ వివరించారు . ఎన్ . హెచ్ 167 అలినగర్ 157.707 కి.మీ నుండి 87.723 కి.మీ మిర్యాలగూడ వరకు రోడ్ విస్తరణ కోసం కేంద్రం రూ . 220 కోట్లు మంజూరు చేసిందని అయితే ప్రస్తుతం ఉన్న మిర్యాలగూడ రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారి విస్తరిస్తే ఆ వ్యయం 65 నుంచి రూ . 70 కోట్ల ఖర్చుతో అయిపోవటంతో పాటుగా సమయం , వ్యయం కలిసి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేసినట్లు నామ తెలిపారు . ప్రస్తుతం 20 నుంచి 30 మీటర్ల వెడల్పు ఉన్న రహదారిలో ట్రాఫిక్ సమస్యలతో పాటు అనేక ప్రమాదాలకు నెలవుగా మారిందన్నారు .