చాలా మంది బ్యాంకు ఖాతాదారులు తమ సొంత ఖాతా నుండి ఎంత నగదునైనా ఎటువంటి ఆంక్షలు లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చని భావిస్తుంటారు. అయితే పారదర్శకతను పెంపొందించడానికి మరియు నల్లధన ప్రవాహాన్ని అరికట్టడానికి భారత ఆదాయపన్ను (ఇన్‌కమ్ టాక్స్) శాఖ అధిక మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై కఠినమైన నిఘా ఉంచుతుంది.
ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 285BA ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ ఖాతా నుండి జరిగే మొత్తం నగదు విత్‌డ్రాయల్స్ లేదా డిపాజిట్లు రూ.10 లక్షలు దాటితే బ్యాంకులు ఆ వివరాలను ఆటోమేటిక్‌గా ఆదాయపన్ను శాఖకు నివేదిస్తాయి. కరెంట్ ఖాతాల కు ఈ పరిమితి రూ.50 లక్షలుగా ఉంది. ఈ సమాచారం నేరుగా మీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్లో నమోదవుతుంది.
రూ.10 లక్షలు దాటినంత మాత్రాన మీకు ఆటోమేటిక్‌గా పన్ను నోటీసు రాదు. విత్‌డ్రా చేసిన నగదు చట్టబద్ధమైనది గతంలోనే మీ జీతం, వ్యాపార లాభాలు లేదా చట్టపరమైన ఆస్తి విక్రయం వంటివి నుండి వచ్చినంత కాలం మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మీ వార్షిక ఐటీఆర్ (ITR) రిటర్న్స్‌లో చూపిన ఆదాయానికి…ఈ విత్‌డ్రాయల్స్‌కు పొంతన లేనప్పుడు మాత్రమే ఐటీ శాఖ విచారణ చేపడుతుంది.
బ్యాంకు నుండి విత్‌డ్రా చేసే పెద్ద మొత్తాలపై ప్రభుత్వం మూలం వద్ద పన్ను తగ్గింపు (TDS) విధిస్తుంది. మీరు క్రమం తప్పకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారైతే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి వరకు విత్‌డ్రాయల్స్‌పై ఎలాంటి టీడీఎస్ ఉండదు. రూ.1 కోటి దాటిన మొత్తంపై 2% టీడీఎస్ కట్ అవుతుంది. ఒకవేళ మీరు గత 3 ఏళ్లుగా ఐటీఆర్ ఫైల్ చేయకపోతే రూ.20 లక్షల నుండి రూ.1 కోటి లోపు విత్‌డ్రాయల్స్‌పై 2% …రూ.1 కోటి దాటితే 5% చొప్పున భారీగా టీడీఎస్ విధిస్తారు.
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ప్యాన్ కార్డు వివరాలను సరిగ్గా అందించడంతో పాటు ఆ నిధులకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను భద్రపరుచుకోవడం చట్టపరమైన ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
Also Read:FD డిటైల్స్ మర్చిపోయారా..అయితే మీకోసమే?

