ఒకటా.. మూడా.. క్యాపిటల్ కన్ఫ్యూజన్ !

35
- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత క్యాపిటల్ కు సంబంధించిన ప్రస్తావన తరచూ చర్చకు వస్తూనే ఉంది. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానుల ప్రతిపాధికను తెరపైకి తీసుకొచ్చారు సి‌ఎం జగన్. దీనిపై ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉంది. అయితే ఏపీ క్యాపిటల్ విశాఖ అంటూ ఆ మద్య జగన్ చెప్పడంతో విశాఖపట్నం ఒక్కటే రాజధానా ? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇక తాజాగా బుగ్గన రాజేంద్ర నాథ్ కూడా విశాఖనే రాజధాని అని కన్ఫర్మ్ చేయడంతో.. త్రీ క్యాపిటల్స్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలైంది. .

ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం త్రీ క్యాపిటల్స్ విధాననికే కట్టుబడి ఉందని, అందువల్ల విశాఖ మత్రెమే కాకుండా కర్నూల్, అమరావతి కూడా రాజధానులుగా ఉంటాయని చెబుతున్నారు వైసీపీ నేతలు. తాజాగా మూడు రాజధానుల విషయంలో మంత్రులు అంబటి రాంబాబు, దర్మాన ప్రసాదరావు, మరియు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తమ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మూడు రాజధానులకే కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. హైకోర్టు కర్నూల్ లో ఉంటుందని, అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని, పరిపాలన విశాఖ నుంచి జరుగుతుందని ఇదే తమ విధానం అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.

బుగ్గన కూడా ఇదే విషయాన్ని చెప్పారని కానీ టీడీపీ నేతలు కావాలనే ఈ అంశంపై అయోమయానికి గురి చేస్తున్నారని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా బుగ్గన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విట్టర్ లో కాస్త ఘాటుగా స్పందించారు. ” అసలు ఏపీ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు మీకు ? ఎన్ని సార్లు ఎన్ని మాటలు మార్చుతారు ? రాష్ట్ర రాజధాని ఏదో కూడా ప్రపంచానికి కమ్యూనికేట్ చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి, దద్దమ్మ మంత్రులు ఉన్నారు ” అంటూ అచ్చన్నాయుడు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. మొత్తానికి ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళం ఇప్పట్లో సద్దుమనిగేలాలేదు. మరి రాబోయే రోజుల్లో క్యాపిటల్ విషయంలో ఎలాంటి స్పష్టత వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -