పాత 500 రూపాయల నోట్ల వినియోగంపై రిజర్వ్ బ్యాంకు కొత్తగా ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంకుల్లో, విమాన టికెట్లు కొనుగోలు చేయడానికి ఈ నెల 2వ తేదీ వరకు మాత్రమే పాత 500 రూపాయల నోటు చెల్లుబాటు అవుతుందని ప్రకటించింది. మొదట ఈ వెసులుబాటును డిసెంబర్ 15 వరకు కల్పించినా..తాజాగా ఈ గడువును డిసెంబర్ 2 వరకు ఆర్భీఐ కుదించింది. దీంతో ఇకపై పెట్రోల్ బంకుల్లో..విమాన టికెట్ల కొనుగోళ్లలో పాత 500 నోటు చెల్లనట్టే. కాగా ఈ నెల 15 వరకు మాత్రం స్కూలు ఫీజులు, పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును వినియోగించుకోవచ్చు.
గత నెల 8న కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత వీటిపై కొన్ని సడలింపులు, ఆంక్షలు విధించింది. 1000 రూపాయల నోటును బ్యాంకులో డిపాజిట్ చేయడం మినహా ఎక్కడా చెల్లుబాటు కాదు. అలాగే పాత 500 రూపాయల నోట్ల మార్పిడిని రద్దు చేశారు. ఈ నోట‍్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పాటు అనుమతించిన చెల్లింపులకు మాత్రమే చెలామణి అవుతుంది.