బీఆర్ఎస్‌లోకి బ్యూరోక్రాట్లు

169
cs
- Advertisement -

బిఆర్ఎస్‌లో బ్యూరోక్రాట్లు
అభివృద్ధి సంక్షేమ నినాదాలకు బ్యూరోక్రాట్ల స్పందన
పొరుగు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు..?
ఒక్కో బ్యూరోక్రాట్ కు ఒక ఎంపీ సెగ్మెంట్..?

అభివృద్ధి-సంక్షేమంతో తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలుచేసే లక్ష్యంతో ఆవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీలో చేరేందుకు దేశవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు భారీగా చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని పలువురు సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటి వరకూ కులాలు, మతాల ప్రాతిపదికన రాజకీయాలు చేసిన పార్టీలు రాజ్యమేలుతున్నాయని, అందుకే ఆ పార్టీలపట్ల విసుగు చెంది రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తిని కూడా చంపేసుకొని రిటైరైన తర్వాత ఖాళీగా ఉంూ పుస్తకాలు చదువుకొంటూ, టూరిస్టులుగా దేశ విదేశాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్న రిటైర్డ్ బ్యూరోక్రాట్లు బి.ఆర్.ఎస్.లో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని కొందరు సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారులు తెలిపారు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో కులాలు, మతాలను పక్కనబెట్టి మొట్టమొదటిసారిగా అభివృద్ధిసంక్షేమం నినాదాలతో ప్రజల ముందుకు వచ్చిన పార్టీ బి.ఆర్.ఎస్.మాత్రమేనని, తప్పకుండా ఈ పార్టీ అన్ని వర్గాల ప్రజలు, తటస్థులు,మేధావులు, వివిధ రంగాల నిపుణులు సైతం బి.ఆర్.ఎస్.లో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని వివరించారు.

అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలు, డి.జి.పి.లుగా పనిచేసిన రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఎకె.ఖాన్ లే కాకుండా ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్న సోమేష్ కుమార్, నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్.కె.జోషి, ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఇటీవలనే రిటైరైన ఆదిత్యనాథ్ దాస్ వంటి సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇతర రాష్ట్రాల్లో పనిచేసిన ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ అధికారులు బీ.ఆర్.ఎస్.లో చేరేందుకు ఉత్సుకత చూపుతున్నారని తెలిసింది. ఉత్తర్ ప్రదేశ్, న్యూఢిల్లీ, ఉత్తరాంచల్, బీహార్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పనిచేసిన బ్యూరోక్రాట్లు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు కాస్తంత సనిహితంగా ఉన్నవారితో దఫదఫాలుగా చర్చలు జరిపినట్లుగా బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఇతర రాష్ట్రాల్లో పనిచేసి రిటైరైన తెలుగు బ్యూరోక్రాట్లు కూడా ఆయా రాష్ట్రాల్లో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, రిటైరైన తర్వాత కూడా ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో తెలుగు అధికారులు సలహాదారులుగా, ఇతర నామినేటెడ్ పదవుల్లో పనిచేస్తున్నారని, అలాంటి వారు కూడా బీ.ఆర్.ఎస్.పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.

తమతమ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి అనుకూలమైన అంశాలు, రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉండి ప్రస్తుతమున్న పార్టీల నేతల వ్యవహారశైలితో విసుగుచెంది ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న నేతలను బి.ఆర్.ఎస్.పార్టీలోకి చేర్చేందుకు కూడా ఈ రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని కూడా అనేక ప్రతిపాదనలను పెట్టినట్లు తెలిసింది. అంతేగాక తమతమ ప్రాంతాలు, రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణలు, అభివృద్ధికి నోచుకోకుండా తిష్టవేసిన ప్రజా సమస్యలు ఏమిటి, ఆయా సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ మోడల్ లో చేపట్టబోయే పథకాలతో నివేదికలు తయారు చేస్తామని, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పర్యటనలు చేపట్టిన తర్వాత స్థానిక సమస్యలను అడ్రస్ చేసే విధంగా, ఆయా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పథకాలు, ప్రాజెక్టులు చేపట్టాలో కూడా అధినేతకు ఫీడ్ బ్యాక్ ఇచ్చే విధంగా ఆ రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, మేధావివర్గాల ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, సమాచార హక్కు ఉద్యమాల్లో పనిచేస్తున్న కార్యకర్తలను కూడా బి.ఆర్.ఎస్.పార్టీలోనికి తీసుకురావడానికి, స్థానికంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ బ్యూరోక్రాట్లు తమకున్న అవహన, అనుభవాలను సైతం కూలంకషంగా వివరిస్తున్నట్లుగా తెలిసింది. బ్యూరోక్రాట్లు తమతమ సర్వీసుల్లో సబ్ కలెక్టర్ స్థాయి నుంచి కలెక్టర్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వంటి వివిధ హోదాల్లో 35 ఏళ్ళ పాటు పనిచేసిన బ్యూరోక్రాట్లకున్న విశేషమైన రాజకీయ పరిచయాలను కూడా బి.ఆర్.ఎస్.పార్టీకి ఉపయోగపడే విధంగా చేయాలని బ్యూరోక్రాట్లతో జరుగుతున్న చర్చల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

- Advertisement -