మెదక్..గులాబీదే గుబాళింపు!

19
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా ప్రజలు ఎవరికి జై కొడతారోనన్న సస్పెన్స్ అందరిలో నెలకొంది. ఇక తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాలు ఒక ఎత్తైతే ఆ స్థానం మరో ఎత్తు. ఎందుకంటే గులాబీ పార్టీ గెలిచే పార్లమెంట్ సీటు ఏదంటే ఎవరైన టక్కున చెప్పే సమాధానం మెదక్. బీఆర్ఎస్ ఆవిర్భావం నుండి మెదక్‌లో ఓటమే ఎరుగదు.

అయితే ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి ముదిరాజ్‌ నాయకుడు నీలం మధు, బీఆర్‌ఎస్‌ నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోటీ చేస్తున్నారు.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో ఈ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యత సంతరించుకుంది.

1980లో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ,2014లో కేసీఆర్ మెదక్‌ ఎంపీగా గెలిచి ఆ తర్వాత రాజీనామా చేశారు. 2004 నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆరు సీట్లను గెలుచుకుని సత్తాచాటింది బీఆర్ఎస్. కాంగ్రెస్ కేవలం మెదక్ సీటును మాత్రమే గెలుచుకుంది. బిజేపీ సిట్టింగ్‌ దుబ్బాక స్థానాన్ని కూడా కోల్పోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా మెదక్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటంతో ఎన్నికల హీట్ మరింత పెరిగిపోయింది.

మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18 లక్షల 12 వేల 858 ఓట్లు ఉండగా, మహిళా ఓటర్లే ఎక్కువ. బీఆర్‌ఎస్‌కు బలమైన సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్, పటానుచెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు మెదక్‌ పరిధిలో ఉన్నాయి. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరైనా గెలుపు బీఆర్ఎస్‌దేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బలమైన అభ్యర్థి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అయిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి పోటీ చేయనుండటంతో ఆ పార్టీ గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకట్రామిరెడ్డి తరఫున గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు మాజీ మంత్రి హరీశ్‌రావు. విస్తృతంగా పర్యటన చేపడుతూ బీఆర్ఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తున్నారు. కాంగ్రెస్ బీసీ అస్త్రంతో వస్తుండగా బీఆర్ఎస్,కాంగ్రెస్ తరపున ఓసీ అభ్యర్థులు బరిలో ఉన్న గెలుపు మాత్రం గులాబీ పార్టీదేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:రేవంత్ కంటే కేసీఆర్ బెటర్:మోత్కుపల్లి

- Advertisement -