సోషల్ మీడియా క్రియేటర్లకు బీహార్ బంపరాఫర్

2
- Advertisement -

సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వీలుగా, వాటిపై వీడియోలు రూపొందించే క్రియేటర్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ‘బీహార్ సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ మీడియా నిబంధనలు-2026’కు సవరణలు చేస్తూ ఈ కీలక విధానాన్ని ఆమోదించారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలపై చేసే వీడియోలకు ప్రతి ఒక లక్ష వ్యూస్‌కు రూ. 10,000 చొప్పున చెల్లించనున్నారు. ఒక వీడియో ఆధారంగా క్రియేటర్లు గరిష్ఠంగా రూ. 1 లక్ష వరకు ఆర్జించే అవకాశం కల్పించారు. వీడియో అప్‌లోడ్ చేసిన 30 రోజుల తర్వాత వచ్చిన వ్యూస్‌ను నిబంధనల ప్రకారం లెక్కిస్తారు. అయితే, ఫేక్ వ్యూస్ లేదా నకిలీ ఫాలోవర్ల అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు క్రియేటర్ల ఛానెళ్లు, పేజీలను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుంది. ఈ ప్రయోజనం పొందాలనుకునే క్రియేటర్లు ముందుగా రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ వద్ద తమ ఛానెళ్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం 13 ముఖ్యమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ఈ కేబినెట్ సమావేశంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రంలో ఏఐ వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ‘తైయో ఏఐ ఇండియా’ సంస్థతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడానికి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

Also Read:ఇరాన్‌కు సాయం చేస్తే..ట్రంప్ వార్నింగ్!

- Advertisement -