‘బిగ్ బాస్’ సీజన్ -1 ఈ రోజుతో ముగిసింది. ‘బిగ్ బాస్’ సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫైనల్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ‘బిగ్ బాస్’ ఫైనల్ లో శివబాలాజీ, ఆదర్శ్ నిలిచారు. ఎట్టకేలకు, ‘బిగ్ బాస్’ విజేతగా శివబాలాజీ నిలిచాడు.
‘బిగ్ బాస్’ ట్రోఫీని, మనీ ప్రైజ్ ని జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు అందజేశాడు. ఈ సందర్భంగా శివబాలాజీని తోటి ఆర్టిస్టులు ప్రశంసించారు. కాగా, ఈ వేడుకకు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లు అందరూ హాజరయ్యారు. ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ లకు పలు కేటగిరిల్లో అవార్డులను జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించగా, ఆయా అవార్డులను సంబంధిత ఆర్టిస్ట్ లు అందుకున్నారు.
ఇదే క్రమంలో.. ‘బిగ్ బాస్’ షో చాలా బాగుందని, ఈ షో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉందని శివబాలాజీ అన్నాడు. ‘బిగ్ బాస్’ ట్రోఫీని, ఫ్రైజ్ మనీని అందుకున్న అనంతరం శివబాలాజీ మాట్లాడుతూ, ‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. ఈ షో నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను.. నా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు. వాస్తవం చెప్పాలంటే వాళ్ల వల్లే నేను ఇంత ప్రశాంతంగా ఈ షోలో ఉండగలిగాను.
నేను సాధించిన ఈ విజయంలో వాళ్ల పాత్ర కూడా ఉంది.. ఈ షో ద్వారా కంటెస్టెంట్ లందరూ చాలా క్లోజ్ అయిపోయారు నాకు. ఎంత క్లోజ్ గా అంటే నా బాల్య మిత్రుల లాగా. ఆడియన్స్ ఇంత సపోర్ట్ ఇస్తారని నేను ఊహించలేదు.
ఇంటింటికీ, పేరు పేరునా ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్. పిల్లలకు నా ముద్దులు.. థ్యాంక్యూ సో మచ్’అని చెప్పాడు. ఈ సందర్భంగా ‘లవ్ యూ’ అని ఎవరికి చెబుతారు? అని శివబాలాజీని జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించగా, ‘హండ్రెట్ పర్సెంట్ మధుకే’ అంటూ తన భార్య పేరును శివబాలాజీ చెప్పడంతో కరతాళధ్వనులు మారుమోగిపోయాయి.