ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నిర్మూలనకు సీఎం కెసిఆర్ చేస్తున్న కృషికి చేదోడు వాదోడుగ ఉండడానికి వీలుగా తెలంగాణ లక్కమారి కాపు సంక్షేమ సంఘం నిర్ణయించింది. సిఎం సహాయ నిధికి రూ.3,45,197 విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర పంచాయతీరాజ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఈ రోజు హైదరాబాద్‌లో అందచేసింది.
లక్కమారి కాపు సంక్షేమ సంఘంలోని 42వేల మంది రైతులు తలా కొంత డబ్బులు పోగు చేసి ఈ మొత్తాన్ని సిద్ధం చేశారు. దీంతో ఆ సంఘాన్ని,రైతులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు. కరోనా వైరస్ పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థతోపాటు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. స్వీయ నియంత్రణ, లాక్ డౌన్ల కారణంగా అనేక విపరిణామాలు సంభవించాయన్నారు. ఈ నష్ట నివారణతోపాటు, రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకోవడానికి అనేక మంది ముందుకువస్తున్నారని, అలా ముందుకువచ్చిన లక్కమారి కాపు సంఘం, రైతులు అభినందనీయులన్నారు. దాతలు తమ ధాతృత్వాన్ని చాటుకోవడానికి ఇది సరైన సమయమని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లక్కమారి కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, పాలకుర్తి ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనుముల నర్సయ్య, గౌరవాధ్యక్షుడు మంద రాజమల్లు, ఆ సంఘం యువజన విభాగం, ఇతర విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.