వేతనాల పెంపు డిమాండ్‌తో 48 గంటల సమ్మెకు దిగారు బ్యాంకు ఉద్యోగులు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో రెండోరోజు ఆర్ధిక లావాదేవిలు స్తంభించాయి. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఉద్యోగుల సమ్మెతో దాదాపు రూ.20,000 కోట్ల వరకు లావాదేవీలపై ప్రభావం చూపించిందని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. ఆర్టీజీఎస్ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ లావాదేవీలు జరుగుతున్నాయని ఆర్బీఐ తెలిపింది.
గతంలో 15 శాతం జీతాలు పెంచిన భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) ఈసారి నామమాత్రంగా 2 శాతం పెంపునకే అంగీకరించడం బ్యాంక్ యూనియన్ల ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే యూఎఫ్‌బీయూ ఆధ్వర్యంలో తొమ్మిది యూనియన్లు సమ్మెకు దిగినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. సమ్మెలో 21 ప్రభుత్వ బ్యాంకులు, పాత తరానికి చెందిన 13 ప్రైవేట్ బ్యాంకులు, మరో 6 విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులున్నాయని ఏఐబీఈఏ తెలిపింది.
బ్యాంకింగ్ రంగంలో 75 శాతంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోవడంతో సామాన్యులు, నిరక్షరాస్యులు, జన్ ధన్ అకౌంట్ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మె నేపథ్యంలో మళ్లీ నగదు కొరత సమస్యలు మొదలైయ్యాయి. నెలాఖరు రోజులు కావడంతో జీతాల చెల్లింపులకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే కేవలం బ్యాకింగ్ సెక్టార్‌లో ఉద్యోగులు మాత్రమే పని చేయడం లేదని … ఏటీఎం, డిపాజిట్ మిషన్లు, ఆన్‌లైన్, మొబైల్ లావాదేవీలు యథాతథంగానే కొనసాగుతున్నట్టు బ్యాంకుల యజమాన్యలు ప్రకటించాయి.