లాక్ డౌన్ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
అలాగే గత లాక్‌డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యథావిధిగా పని చేస్తాయని తెలంగాణ కేబినెట్ స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు 33శాతం సిబ్బందితో పనిచేస్తాయి అని తెలిపింది. లాక్‌డౌన్ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ర్టానిక్ మీడియాకు మినహాయింపు ఇచ్చింది. వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యథావిధిగా సాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యథావిధిగా పనిచేస్తాయి. జాతీయ రహదారుల మీద రవాణా యథావిధిగా కొనసాగుతుంది. జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.