రాష్ట్రంలో య‌థావిధిగా ధాన్యం కొనుగోళ్లు..

116
paddy procurement

ప్రగతి భవన్ లో ఇవాళ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. మే 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10 రోజులపాటు లాక్ డౌన్ విధిస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటలపాటు మాత్రమే అన్నిరకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటలపాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుందని క్యాబినెట్ నిర్ణయించింది.

అయితే రాష్ట్రంలో క‌రోనా లాక్‌డౌన్ విధించిన‌ప్ప‌టికీ ధాన్యం కొనుగోళ్లు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదని.. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.