ఓ మాజీ ప్రధాని విరాళాల రూపంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఈ విషయాన్నిఢాకా న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ మాజీ ప్రధానికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
సుమారు 21 మిలియన్ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు ఈ శిక్ష విధించింది.
ఆ ప్రధాని ఎవరో కాదు..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72). ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాజకీయ కక్ష్యతో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు జియా తెలిపారు. కాగా..ఈ కేసుతో సంబంధం ఉన్న ఆమె కుమారుడు తారిఖ్ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది న్యాయస్థానం.
అంతకముందు భారీ సంఖ్యలో కోర్టుకు హాజరైన ఆమె మద్దతుదారులను పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించి చెదరగొట్టారు. ఇక ఈ పరిణామంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.