విభజన చట్టం హామీలను నెరవేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ బండా ప్రకాశ్. రాజ్యసభలో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన బండా ప్రకాశ్… హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు ఐఐఎం, ఐటీఐఆర్ ప్రాజెక్టు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను మంజూరు చేయాలని ఎంపీ బండా ప్రకాశ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆరేండ్ల కాలంలో ఐటీ ఎగుమతులు బాగా పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. కేంద్రం ప్రకటించిన మెగా టెక్స్‌టైల్స్ స్కీంలో వరంగల్‌లో నిర్మిస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును చేర్చాలన్నారు. రైతుబంధు కింద ప్రతి ఎకరాకు రూ. 5 వేల చొప్పున సాయం చేస్తున్నామని, ఏ కారణం చేత రైతు చనిపోయినా.. రైతుబీమా కింద ఐదు రోజుల్లో రూ. 5 లక్షలు వారి ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. రైతుబీమా పథకం 32.73 లక్షల పట్టాదార్లకు వర్తిస్తుందని ఎంపీ తెలిపారు. తెలంగాణలో 98.7 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.