ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం- బాలకృష్ణ

101
- Advertisement -

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌ హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్ర‌త్యేకంగా వీక్షించ‌డం జ‌రిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో…

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఒకనాడు భక్తిని బతికించింది రామారావు గారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ చిత్రమే నిదర్శనం. ఇది కేవలం మా విజయం కాదు.. ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం. ఈ సినిమా కోసం 21 నెలలు కష్టపడ్డాం. ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి, ఎంతో ఓపికపట్టి చేశారు. రకరకాల లొకేషన్లలో సినిమాను షూట్ చేశాం. కరోనా ఎంత ప్రాణాంతకమో.. కానీ వాటన్నంటిని లెక్కచేయలేదు. మంచి సినిమా చేస్తున్నాం..చిరస్థాయిగా నిలిచిపోతామన్న సంకల్పంతో పని చేశారు. దానికి ఈ ఫలితమే నిదర్శనం. అఖండ ఓ పౌరాణికి చిత్రం. భగవంతుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు అని ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ ఇండస్ట్రీ ఎదురుచూసింది. ఈ అఖండకు అఖండమైన విజయం చేకూర్చారు. సినిమాను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పను. అభినందనలు తెలియజేస్తాను. ఇలాంటి సినిమాలకు ఆదరించినందుకు తెలుగు ప్రేక్షకులకు అభినందనలు. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. తిరిగి రాయాలన్నా మేమే.. ఆ నాడు రామారావు గారు సినిమా మాధ్యమం ద్వారా భక్తిని కాపాడారు. మున్ముందు తరాలకు కూడా భక్తి అంటే ఏంటో చూపిస్తాం. భక్తి అంటే విల్ పవర్. ధృడ సంకల్పం. ఇప్పుడే సినిమాను చూశాను. ఇది బాలకృష్ణనా? అని నాకే డౌట్ వచ్చింది. మంచి చిత్రాలతో, మంచి పనులతో సమాజానికి సేవ చేసేందుకు నాకు అదృష్టం దొరికింది. తమన్ మంచి సంగీతాన్ని అందించారు. చేసే పనిలోనే దైవం ఉంటుంది. మేం ఆ పనినే నమ్ముకుంటాం. ఈ ఇండస్ట్రీనే నమ్ముకుని ఉంటాం. అఖండ సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్లకు అభినందనలు. సినిమాయే మాకు దైవం. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్‌ని. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తాను’ అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీ‌ను మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఈ సినిమా విడుదలై అందరి నోటి నుంచి ఒకే ఒక మాట వచ్చింది. సూపర్ హిట్ అని అంటున్నారు. రెండు కరోనాలను ఎదుర్కొని విడుదలైన ఈ సినిమా.. నందమూరి అభిమానులు, ప్రేక్షకులందరికీ సంతోషాన్ని ఇచ్చింది. థియేటర్ల ముందు ఇంత సందడి వాతావరణం ఇరవై ఏళ్ల క్రితం చూశాం. మళ్లీ ఇప్పుడు కనిపించింది. సినిమాను ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇది మా విజయం కాదు.. సినిమా విజయం.. ఇండస్ట్రీ విజయం. ఈ విజయాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్లాలి’ అని అన్నారు.

చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అఖండ సినిమాకు అఖండ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. నందమూరి హీరోల సినిమాలు విడుదలైతే.. నందమూరి అభిమానులు ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. కానీ ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టారు’ అని అన్నారు

సంగీత ద‌ర్శ‌కుడు తమన్ మాట్లాడుతూ.. ‘గత ఏడాది మార్చిలో ఈ కథ విన్నాను. అప్పటి నుంచి ఎలా చేయాలా? అని తెగ ఆలోచించాం. అఘోర, శివుడి గురించి రీసెర్చ్ చేశాం. బోయపాటి గారు నేను చాలా కష్టపడ్డాం. ఈ సినిమాను మాస్ జాతర చేసేశారు. చాలా సంతోషంగా ఉంది. నందమూరి అభిమానులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. బాలయ్య గారికి హిట్ వస్తే.. అది ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టే. దేవుడి వేషం వేస్తే సరిపోయేది రామారావు గారికే. ఆ తరువాత బాలయ్య గారికే ఆ వేషాలు సరిపోతాయి. అఖండను ఇంత అఖండమైన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఆ శివుడే మాకు ఈ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్కడా తగ్గకూడదు. ఈ విజయంతో ఇంకా మున్ముందుకు వెళ్లాలి’ అని అన్నారు.

- Advertisement -