అక్టోబర్ 10న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓవైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. నిన్న మంచు విష్ణు తన ప్యానల్‌ను ప్రకటించారు. కాగా సీనియర్ నటుడు బాబూమోహన్ తాజా ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్లో కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబూమోహన్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా ప్రకాశ్ రాజ్ పేరెత్తకుండా మరో ప్యానెల్ ప్రెసిడెంట్ అంటూ విమర్శించారు.
“మరో ప్యానెల్ అధ్యక్షుడు మా ప్యానెల్ వాళ్లను అనవసరంగా విమర్శిస్తున్నారు. వారు అలా చేశారు, వీరు ఇలా చేశారు అంటూ ఆ ప్యానెల్ అధ్యక్షుడు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదు. ఆయన వైఖరి నాకు ఎంతో బాధ కలిగిస్తోంది” అని వెల్లడించారు. అంతేకాదు, ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ను నడిపించేందుకు మంచు విష్ణు సమర్థుడని బాబూమోహన్ అభిప్రాయపడ్డారు. మంచు విష్ణు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మంచు విష్ణుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.