రాజమౌళి తెరకెక్కొంచిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి. ప్రపంచ రికార్డులు సాధించిన ఈ సినిమా టాలీవుడ్ స్థాయిని మరింత పెంచింది. బాహుబలి 1లో గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన రాజమౌళి కట్టప్పతో ‘బాహుబలి’ని చంపించి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ‘బాహుబలి ది బిగినింగ్’ విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడా?’ అని ఆలోచించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ కన్‌క్లూజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ సస్పెన్స్ వీడాలంటే ఏప్రిల్ 28 వరకు ఆగాల్సిందే అని ఆర్కా మీడియా ఆంక్షలు విధించింది. దీంతో తమకు ఎంతో కొంత సమాధానం తెలిసినా కూడా బాహుబలి చిత్ర యూనిట్ ఆ విషయాన్ని రివీల్ చేయలేదు. అయితే తాజాగా సోషల్‌మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. సృష్టికర్తలెవరో తెలియదు కానీ ఇదే ‘బాహుబలి కన్‌క్లూజన్’ అని నమ్మేలా ఉంది ఆ స్టోరీ. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సొచ్చిందో కూడా అందులో వివరించారు.
గిరిజన రాజు కూతురు దేవసేనను బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె నగరానికి రావటానికి నిరాకరిస్తుంది. ఆమెతోనే గడుపుతుంటాడు బాహుబలి. భల్లాల దేవుడు అతడిని ప్రోత్సహించి దేవసేనతోనే ఉండటం న్యాయమంటాడు. కానీ రాజమాతకు మాత్రం లేనిపోనివి నూరిపోస్తాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. అక్కడినుంచీ బాహుబలిని నిర్మూలించటానికి ప్రణాళికలు వేస్తాడు.
తన మనుషులతోనే అరాచకాలు చేయించి అవన్నీ ఆటవికసైన్యం చేస్తోందనీ, వారికి బాహుబలి మద్దతు ఉందనీ చెప్తాడు. దీంతో రాజమాత శివగామి ఆగ్రహిస్తుంది. తన వద్దకు రావాలని బాహుబలిని ఆదేశిస్తుంది. కానీ ఆ ఆదేశాలు బాహుబలికి చేరకుండా భల్లాల దేవుడు కుట్ర చేస్తాడు. ఈ లోగా మాహిష్మతి సైన్యం ఆటవికులను దోచుకోవటం, గిరిజన స్త్రీలను చెరబట్టటం చేస్తుంటుంది. ఇదేమీ శివగామికి తెలియనివ్వకపోగా ఆటవికుల దాడులు అధికమయ్యాయనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించలేకపోతున్నారనీ చెప్తుంటారు. దీంతో బాహుబలిని బంధించి తేవాలని రాజమాత ఆదేశిస్తుంది. అదే భల్లాల దేవునికి కావలసింది. సైన్యంతో బయలు దేరుతాడు.
కట్టప్ప కోటకు కాపలాగా ఉంటాడు. భల్లాలదేవుని దండయాత్ర గురించి తెలిసి దేవసేన, బాహుబలి ఎదురువెళతారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. భల్లాలదేవుడి దుష్ట అనుచరులు ఒకవేపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఓ వేపు. ఈ విషయం రాజమాతకు వేగులు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్తసంబంధం కన్నా రాజ్యమే గొప్పదనీ, బాహుబలిని బంధించి, లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలనీ ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళతాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది. భల్లాల దేవుడు ఓడిపోతుంటాడు. బాహుబలి భల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞ పాటిస్తాడు.
భల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలు దేరుతుంది. భల్లాలదేవుడు ఆమెను వెంటాడుతూ కోటకు చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను రాజమాతకు అప్పగించి జరిగినదంతా చెపుతుంది. రాజమాత పశ్చాత్తాప పడుతుంది. ఆ బిడ్డను కూడా చంపితే శత్రుశేషం ఉండదని భల్లాల దేవుడు, అతడి తండ్రీ అనుకుంటారు. కానీ రాజమాత బిడ్డను తీసుకుని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావటమో, అడవిపాలు కావటమో జరిగింది. రాజమాతకే దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ భల్లాల దేవుని అనుచరులు కొండ కిందివరకూ వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడి చనిపోయిందని భల్లాల దేవుడికి చెప్తారు.
అతడు దేవసేనను బంధించి, కట్టప్పను విశ్వాసబంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తుంటాడు. తమ బిడ్డను రక్షించుకోవటానికి ఆటవికులు ప్రయత్నాలు చేస్తుంటారు. రెండోబాహుబలి సాయంతో వారు భల్లాల దేవుని ఎలా ఓడించారు.? మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు.? దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా …..ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి కంక్లూజన్. మరి ఇది అసలు కథేనా కాద అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాలి.