అదరగొట్టిన ఆసీస్..

367
- Advertisement -

ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారు జట్టు.. మరో విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.4 ఓవర్లలో 157 పరుగులకే ఆలవుటై 86 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

మిచెల్ స్టార్క్ అద్భుత స్పెల్‌తో కివీస్‌కు చుక్కలు చూపించాడు. 9.4 ఓవర్లు వేసిన స్టార్క్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కేన్ విలియమ్సన్ (40), రాస్ టేలర్ (30), మార్టిన్ గప్టిల్ (20) ఆ మాత్రమైనా రాణించడంతో కివీస్ స్కోరు 150 పరుగులు దాటింది. ఆరుగురు ఆటగాళ్లు కనీసం పది పరుగులు కూడా చేయలేకపోయారు.

New Zealand vs Australia

అంతకుముందు బౌల్ట్‌ (4/51), ఫెర్గూసన్‌ (2/49), నీషమ్‌ (2/28)ల ధాటికి ఆసీస్‌ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బౌల్ట్‌.. వరుస బంతుల్లో ఖవాజా, స్టార్క్‌, బెరెన్‌డార్ఫ్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు.

బౌల్ట్‌కు వన్డేల్లో ఇది రెండో హ్యాట్రిక్‌. ఈ ప్రపంచకప్‌లో షమి తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ అతనే. వరుసగా ఐదు విజయాలు సాధించిన కివీస్‌కు.. ఇది వరుసగా రెండో ఓటమి. అయితే 11 పాయింట్లతో ఆ జట్టు సెమీస్‌కు చేరువగానే ఉంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడిస్తే ఆ జట్టు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ చేరుతుంది. ఆ మ్యాచ్‌ ఓడినా.. కివీస్‌ ముందంజ వేయడానికి మెరుగైన అవకాశాలే ఉన్నాయి.

- Advertisement -