అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) తిరుగులేని ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. తాజా ట్రెండ్స్ రాష్ట్రంలోని మొత్తం 126 స్థానాలకు గాను, ఎన్డీఏ కూటమి ఇప్పటికే 87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ మెజారిటీ మార్కును (64) సునాయాసంగా దాటేసింది.
ఈ ఫలితాల ద్వారా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వరుసగా మూడోసారి అస్సాం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.BJP: 71 స్థానాల్లో ముందంజలో ఉంది. BPF (మిత్రపక్షం): 09 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.AGP (మిత్రపక్షం): 07 స్థానాల్లో ముందంజలో ఉంది.
కాంగ్రెస్ కూటమి: కేవలం 21-23 స్థానాలకే పరిమితమైంది.ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన సొంత నియోజకవర్గమైన జలుక్‌బారిలో భారీ మెజారిటీతో విజయం దిశగా సాగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత గౌరవ్ గొగోయ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచారం ఈసారి కూడా ఫలితాన్నివ్వలేదు. నాజిరా వంటి కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకంజలో ఉండటం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. “మేము ఊహించిన ఫలితాలే వస్తున్నాయి. ప్రధాని మోదీ అభివృద్ధి అజెండా, హిమంత బిశ్వ శర్మ సమర్థవంతమైన పాలన అస్సాం ప్రజలను మళ్ళీ ఎన్డీఏ వైపు నడిపించాయి” అని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ, తమ పార్టీ కౌంటింగ్ ప్రక్రియను నిశితంగా గమనిస్తోందని, తుది ఫలితం వచ్చే వరకు వేచి చూస్తామని పేర్కొన్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్‌ను బట్టి చూస్తే, అస్సాంలో బీజేపీ కూటమి 100 స్థానాలకు చేరువయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

