పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం (మే 4) ఫలితాల ప్రకటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చే ఉద్వేగాల వల్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గెలిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి భారీ జనసమీకరణతో వీధుల్లోకి రాకూడదని ఆదేశించారు. విజయం సాధించిన అభ్యర్థులు తమ వెంట కేవలం ఇద్దరు వ్యక్తులతో మాత్రమే వచ్చి రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం (Winner Certificate) తీసుకోవాలని నిబంధన విధించారు.
గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర బలగాల గస్తీని కొనసాగించనున్నారు.ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది.
Also Read;బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!
పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సమయంలో అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, తాజాగా ‘ఫాల్టా’ నియోజకవర్గంలో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం బెంగాల్ మాత్రమే కాకుండా, కేరళ, తమిళనాడులో కూడా ఇలాంటి పరిమిత ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ప్రజలు మరియు రాజకీయ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఫలితాలను శాంతియుతంగా స్వీకరించాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది.

