ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

146
ap mlc
- Advertisement -

ఏపీ గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్‌ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి.

- Advertisement -