ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను. కరోనా, ఆర్ధిక కష్టాలు లేకపోయి ఉంటే మిమ్మల్ని మరింత సంతోష పెట్టేవాడిని అన్నారు ఏపీ సీఎం జగన్. మంత్రుల కమిటీ చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు.. ఈనేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. వారితో సీఎం మాట్లాడారు. మీరు లేకుంటే నేను లేను. ఈ ప్రభుత్వమే మీది. దయచేసి ఉద్యోగులు భావోద్వేగాలకు లోను కావొద్దు. ఇప్పటికీ ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అంటూ సీఎం జగన్ ఉద్యోగులకు చెప్పారు.
ఓవైపు కరోనా సంక్షోభంతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని స్పష్టం చేశారు. పరిస్థితులు బాగుండి ఉంటే మిమ్మల్ని ఇంకెంత సంతోష పెట్టేవాడ్నో అని వ్యాఖ్యానించారు. కానీ భవిష్యత్తులో… ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అనిపించుకుంటాను అని హామీ ఇచ్చారు.
నిన్న మంత్రుల కమిటీ మీ ముందు ఉంచిన ప్రతి ప్రతిపాదనకు నా సమ్మతి ఉంది అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేయడానికైనా ఉద్యోగుల సహకారమే ముఖ్యమని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. సీపీఎస్ అంశంలోనూ మెరుగైన నిర్ణయం తీసుకుంటామని, సీపీఎస్ పై నిర్ణయం తీసుకోవడంలో ఉద్యోగ సంఘాల తోడ్పాటు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులతోనే ఉంటుందన్న విషయం మరువొద్దు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.