అతికొద్ది మంది మధ్యలో సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుని.. బంధువులు, స్నేహితులకు దిల్లీలో అదిరిపోయే వివాహ విందు ఇచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ జోడీ.. మంగళవారం బాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల కోసం ముంబయిలో ఘనంగా విందు ఏర్పాటు చేసింది. సెయింట్ రెజిస్ హోటల్‌లో కళ్లు చెదిరే రీతిలో జరిగిన ఈ వేడుకలో తారా లోకం తళుక్కుమంది. దేశంలోని సినీ, క్రికెట్, క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి రాగా.. సునీల్ గావస్కర్, అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ సతీ సమేతంగా విచ్చేశారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య, షారుక్ ఖాన్, ఏఆర్ రెహమాన్, శ్రీదేవి, రేఖ, మాధురీ దీక్షిత్, కత్రినా కైఫ్, కంగనా రనౌత్, లారా దత్తా, మహేష్ భూపతి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తదితరులు పాల్గొన్నారు. టీమ్‌ఇండియాలోని సభ్యులంతా ప్రత్యేక సూట్‌లతో దర్శనమిచ్చారు. రాత్రి 8 తర్వాత మొదలైన వేడుక.. అర్ధరాత్రి దాటేవరకు కొనసాగింది.
షారుక్, కొత్త దంపతులతో కలిసి చిందులేశాడు. కోహ్లి, యువీ, హర్భజన్‌లతో కలిసి పంజాబీ నృత్యంతో అలరించాడు. డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో కుటుంబ సభ్యుల మధ్య విరాట్ కోహ్లి, అనుష్క పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం వివాహ విందుతో పెళ్లి వేడుకలు ముగిసినట్లే. ఇక వీరిద్దరు కలిసి దక్షిణాఫ్రికా వెళ్లనున్నారు. కొత్త సంవత్సర వేడుకలు ముగిశాక అనుష్క శర్మ ముంబయి తిరిగొస్తుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం కోహ్లి అక్కడే ఉంటాడు.