హైదరాబాద్‌కు మరో మణిహారం రాబోతుంది. ప్రస్తుతమున్న ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)కు అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డును ప్రపంచ స్ధాయి ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశమైన సీఎం…రీజనల్ రింగ్ రోడ్డుపై చర్చించారు.
హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు భవిష్యత్ అవసరాలను తీర్చలేదని మరో రీజనల్ రింగు రోడ్డు నిర్మించాలని సూచించారు. హైదరాబాద్ వాతావరణం,సామరస్య జీవన విధానం కారణంగా పట్టణీకరణ పెరగడంతో పాటు దేశ నలుమూలల నుంచి రాకపోకలు పెరుగుతాయని వాటిని దృష్టిలో ఉంచుకుని ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టాలన్నారు.
సంగారెడ్డి- గజ్వేల్- చౌటుప్పల్- మాల్- కడ్తాల్- షాద్‌నగర్- చేవెళ్ల- కంది పట్టణాలను కలుపుతూ 338 కిలోమీటర్ల మేర 500 అడుగుల వెడల్పుతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సూచించారు సీఎం కేసీఆర్. విజయవాడ, ముంబై, బెంగళూరు, నాగపూర్ నగరాలకు వెళ్లే మార్గంలో జంక్షన్లను అభివృద్ధి చేయాలని అన్నిరకాల సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం అవసరమైన స్థల సేకరణ చేపట్టాలని సూచించారు. ఇందుకోసం వివిధ దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలి అని అధికారులకు చెప్పారు.