నీట్ రీ-టెస్ట్.. అన్నామలై విమర్శలు

2
- Advertisement -

మే 3న జరిగిన అసలు పరీక్షలో భారీ అక్రమాలు, పేపర్ లీకేజీలు జరగడంతో కేంద్ర ప్రభుత్వం దానిని రద్దు చేసి, జూన్ 21న నీట్ పునఃపరీక్ష (NEET Re-test) నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు కొద్దిరోజుల ముందు తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నీట్ రీ-టెస్ట్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కఠినమైన భద్రతా చర్యలను అన్నామలై ప్రస్తావించారు. ఈ స్థాయి అతిజాగ్రత్తలు మరియు ఆంక్షలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ…”ఐఏఎఫ్ (IAF) ఎయిర్‌లిఫ్ట్‌తో పాటు సీఆర్‌పీఎఫ్ (CRPF) + సీఐఎస్‌ఎఫ్ (CISF) లతో కూడిన రెండు అంచెల రక్షణ. ఏఐ (AI) నిఘాతో కూడిన 4-లేయర్ సీసీటీవీలు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు బయోమెట్రిక్ & ఫేషియల్ రికగ్నిషన్. మల్టిపుల్ లేయర్ల తనిఖీలు. నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పర్యవేక్షణతో కూడిన మల్టీ-లెవెల్ నిఘా…అవును, మీరు చదివింది నిజమే. కానీ ఇవేవీ అత్యంత రహస్యమైన, సైనిక స్థాయి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయడానికి చేసిన ఏర్పాట్లు కావు. జూన్ 21, 2026న జరగబోయే నీట్ రీ-టెస్ట్ కోసం కేంద్ర విద్యాశాఖ చేసిన ఏర్పాట్లు అని అన్నామలై ట్వీట్ చేశారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యలు విద్యార్థులపై ఇప్పటికే ఉన్న పరీక్షల ఒత్తిడిని మరింత పెంచుతాయని అన్నామలై వాదించారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే ముందు పెంచిన నిఘా, సుదీర్ఘ తనిఖీలు, అలాగే పరీక్షా సమయాన్ని 180 నిమిషాల నుండి 195 నిమిషాలకు పెంచడం వంటివి విద్యార్థులపై మానసిక భారాన్ని పెంచుతాయి అన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, నెలల తరబడి కష్టపడి చదివిన యువ విద్యార్థులపై పరీక్షకు ముందు మోపిన ఈ అదనపు భారాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఇది మన పరీక్షా విధానం యొక్క అసలు ఉద్దేశాన్ని మరియు ‘పరీక్షల ఒత్తిడిని తగ్గించాలి’ అనే జాతీయ విద్యా విధానం (NEP 2020) లక్ష్యాన్ని నీరుగార్చుతోంది అని తెలిపారు.

Also Read:తనపై జరిగిన దాడి..విన్యాసమే:అభిజిత్

రీ-టెస్ట్ నిర్వహించడానికి ప్రభుత్వం ఎంచుకున్న ఈ కొత్త విధానంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలకు అర్థవంతమైన పరిష్కారాలు కావాల్సిందే. అయితే, నీట్ రీ-టెస్ట్ కోసం రూపొందించిన ఈ విధానం సమస్యను పరిష్కరించకపోగా.. సరికొత్త సమస్యల వలయానికి దారితీసే ప్రమాదం ఉందని నేను ఆందోళన చెందుతున్నాను అని అన్నామలై స్పష్టం చేశారు.

- Advertisement -